Brics Summit 2023: బ్రిక్స్ సదస్సులో కలిసి నడుస్తూ, ముచ్చటించిన మోదీ, జీ జిన్పింగ్
Source: ABP Desam | Original Published At: 2023-08-24 14:19:16 UTC
Key Points
- భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో అనధికారిక సమావేశం
- బ్రిక్స్ కూటమిలో 6 కొత్త దేశాల చేరిక (అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
- గాల్వాన్ ఘర్షణ తర్వాత నాలుగేళ్లలో మోదీ-జిన్పింగ్ మధ్య మొదటి వ్యక్తిగత పరస్పర చర్చ
Brics Summit 2023: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పక్కపక్కనే నడుస్తూ కాసేపు ముచ్చటించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నాయకులు ఒకరితో ఒకరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం నాడు జరిగిన ఈ సదస్సు సందర్భంగా ఇది జరిగింది.
5 దేశాలు ఉన్న ఈ బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలను కొత్త సభ్యులుగా ఆహ్వానించిన తర్వాత కొద్దిసేపటికే.. పీఎం మోదీ, అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య ఈ అనధికారిక చాట్ కెమెరాకు చిక్కింది. చైనా నేతృత్వంలో జోహెన్నస్ బర్గ్ వేదికగా మూడ్రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది.
చర్చలు, మార్గదర్శకాలు, సూత్రాల సర్దుబాటు తర్వాత బ్రిక్స్ కూటమిలోకి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను బ్రిక్స్ లోకి ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కూటమిలోని ఐదు సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు ఈ ఆరు దేశాలు వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి పూర్తి స్థాయి సభ్య దేశాలుగా బ్రిక్స్ కూటమిలో కొనసాగనున్నాయి. ఈ సమావేశం తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా సమావేశం జరుగుతుందా లేదా అనే దానిపై సమాచారం అయితే లేదు. గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినప్పటి నుంచి దాదాపు నాలుగేళ్లుగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగలేదు.
బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో గురువారం చివరి రోజు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇరాన్, ఇథియోపియా, మొజాంబిక్ దేశాల నేతలతో మోదీ సమావేశం అవుతారు. అయితే, ఈ రోజు ఆయన అధికారికంగా భేటీ అవనున్న మరో రెండు దేశాల పేర్లను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.